: పుష్కర విధులకు వచ్చిన ఎస్ఐని వెంటాడిన మృత్యువు
గోదావరి మహా పుష్కరాల్లో మరో అపశృతి జరిగింది. పుష్కర విధులకు వచ్చిన గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ ఎస్ఐ కే.వీ.శంకర్ రావు (38)ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో, ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే, మూడు రోజుల క్రితం రాజమండ్రికి వచ్చిన శంకర్ రావు తనకు కేటాయించిన విధుల్లో భాగంగా గోదావరిపై ఉన్న నాలుగో వంతెనపై విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న బైకు ఓ మట్టికుప్పను ఢీకొని అదుపుతప్పి కిందపడగా, ఆ వెంటనే అటుగా వెళ్తున్న వాహనం ఆయన తలపై నుంచి వెళ్లిపోయింది. తీవ్రగాయాలపాలైన శంకర్ రావు ఘటనా స్థలిలోనే ప్రాణాలు వదిలారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. కాగా, ఎస్ఐ మృతిపట్ల తీవ్ర సంతాపం వెలిబుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్ఐ కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. తక్షణ సాయంగా రూ. 50 వేలను డీజీపీ రాముడు మృతుని బంధువులకు అందజేశారు.