: పోలీసులకు ఫోన్ చేసి 'బుజ్జిగాడు' డైలాగులు చెబుతున్నారు
పూరి జగన్నాథ్ సినిమా 'బుజ్జిగాడు'లో 'ఏవండే...కాసేపు మాట్లాడండే...ఎవన్నా మాట్లాడండే' అనే డైలాగులతో ప్రభాస్ (బుజ్జిగాడు) త్రిష (చిట్టి)ను తెగ ఇబ్బంది పెడతాడు. అచ్చం అలాగే జార్ఖండ్ పోలీసులను ఆకతాయిలు తెగ వేధిస్తున్నారట. అదేంటి, పోలీసులు కదా ఆకతాయిల పని పట్టేది, అనుకుంటున్నారా? జార్ఖండ్ లో అంతే...ఆకతాయిలే పోలీసుల్ని వేధిస్తున్నారు. గత వారం 100 నెంబర్ కు వచ్చిన 3600 ఫోన్ కాల్స్ ఫేక్ అని జార్ఖండ్ ట్రాఫిక్ ఎస్పీ ఎస్ కార్తీక్ తెలిపారు. ఫేక్ కాల్స్ లో ఎక్కువ భాగం 'ఇంట్లో ఒంటరిగా ఉన్నాను...బోర్ కొడుతోంది... కాసేపు మాట్లాడండి...పోనీ పిల్లల్ని ఆడించండి' అంటూ పోలీసులకు ఆకతాయిలు ఫోన్లు చేస్తున్నారట. కేవలం 15 ఫోన్ కాల్స్ మాత్రమే అత్యవసర సేవలు అవసరమైనవని ఆయన పేర్కొన్నారు. అయితే ఫేక్ కాల్స్ చేసిన వారి నెంబర్లు నోట్ చేసుకున్నామని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. న్యూసెన్స్ సృష్టిస్తున్న వారిని ఊరికే వదలమని ఆయన చెప్పారు. అత్యవసర సేవల నెంబర్ ను దుర్వినియోగం చేయడం నేరమని ఆయన స్పష్టం చేశారు.