: 4జీ సిగ్నల్స్ కోసం 'కోకోనట్ ట్రీ టవర్'
సెల్ టవర్లు కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలో ట్రీ టవర్లు రాబోతున్నాయి. తాజాగా 4జీ మొబైల్ సిగ్నల్స్ కోసం హైదరాబాద్ లో కృత్రిమ కొబ్బరి చెట్టు ఆకారంలో టవర్లు ఏర్పాటు చేశారు. మేడ్చల్ కు సమీపంలోని గూడవల్లిలో ఓ ప్రైవేట్ సెల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ట్రయల్స్ కోసం తొలిసారి ట్రీ టవర్ ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల తరువాత నగరమంతా అలాంటి టవర్లు కనిపించనున్నాయి. 25 మీటర్ల పొడవు, తక్కువ విస్తీర్ణం ఉన్న స్టీల్ పైప్ తో ఈ టవర్ లను ఏర్పాటు చేస్తారు. సంప్రదాయ టవర్ల నిర్మాణానికి ఎక్కువ స్థలం కావాలి. అదే ట్రీ టవర్లకు స్థల సమస్య ఉండదు, అద్దె భారం తగ్గుతుంది. వీటిని 'కామోఫ్లాగ్డ్ టవర్స్' అంటారు. హైదరాబాద్ లోని మెట్రో రైలులో ప్రయాణించే వారికి కూడా ఈ 4జీ సేవలు అందుబాటులోకి తేనున్నారు. ట్రైన్ ఎంట్రీ, ఎగ్జిట్ కు సమీపంలో ప్రతీ స్టేషన్ కు నాలుగు ట్రీ టవర్లను ఏర్పాటు చేయనున్నారు.