: వారి తిట్ల పురాణమే బీహార్లో బీజేపీ ప్రచారాస్త్రం!
బీహార్లో ఎన్నికల వాతావరణం రంజుగా మారింది. ఆయా పార్టీలు ప్రత్యర్థులను ఇరుకునపెట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నిన్నటిదాకా కత్తులు దూసుకుని, ఇప్పుడు చేయిచేయి కలిపి ఎన్నికల బరిలో దిగనున్న నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లను దెబ్బతీసేందుకు బీజేపీ కొత్త ప్రచారాస్త్రాన్ని తెరపైకి తేనుంది. ఒకప్పుడు పరస్పర దూషణలతో నితీశ్, లాలూ బద్ధ శత్రువుల్లా వ్యవహరించారు. వారిద్దరి ఆనాటి వైరమే ఇప్పుడు బీజేపీ అమ్ములపొదిలో చేరింది. నితీశ్, లాలూ ఒకరినొకరు తిట్టుకున్న దృశ్యాలతో కూడిన వీడియో క్లిప్పింగ్స్ తో జోరుగా ప్రచారం చేయాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. అందుకోసం భారీ ఎల్ఈడీ టీవీలతో కూడిన 160 ప్రచార రథాలను సిద్ధం చేసింది. మున్ముందు వాటి సంఖ్య మరింత పెరగనుందట. వారి అసలు స్వరూపాన్ని ప్రజలకు కళ్లకుకట్టినట్టు చూపాలన్నదే బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది.