: పాక్ లో భారత 'డ్రోన్ గూఢచర్యం'... దౌత్యాధికారికి సమన్లు!
తమదేశంపై గూఢచర్యం చేసేందుకు భారత్ ప్రయత్నించిందని, అందులో భాగంగా కెమెరాలు అమర్చిన డ్రోన్ (మానవ రహిత విమానం)ను ప్రయోగించిందని ఆరోపిస్తూ, పాకిస్థాన్ లోని భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్ కు సమన్లు జారీ చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద ఏరియల్ ఫోటోలను ఈ డ్రోన్ చిత్రీకరిస్తుండగా, తమ సైన్యం కూల్చివేసిందని తెలుపుతూ, హై కమిషనర్ ను విదేశాంగ కార్యాలయం పిలిపించి వివరణ కోరింది. భీమ్ బర్ వద్ద డ్రోన్ గూఢచర్యం జరిగిందని తెలిపింది. ఇది చైనాలో తయారైన డీజేఐ ఫాంటమ్-3 డ్రోన్ అని పేర్కొంది. కాగా, ఈ ఆరోపణలను భారత సైన్యం తోసిపుచ్చింది. తాము ఏ విధమైన డ్రోన్లనూ ప్రయోగించలేదని స్పష్టం చేసింది.