: పుష్కర భక్తులకు కేశినేని నాని ఉచిత బస్సు సర్వీసులు
విజయవాడ ఎంపీ కేశినేని నాని తన సామాజిక సేవలను మరింత విస్తృతం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ రంగంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన నాని, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ నేతగానూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన తొలిసారే విజయ దుందుభి మోగించిన ఆయన నేరుగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ప్రస్తుతం పవిత్ర గోదావరి పుష్కరాలు తెలుగు రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు వెళ్లే బెజవాడ భక్తుల కోసం కేశినేని నాని ఉచిత బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ నుంచి రాజమండ్రికి రోజూ రెండు బస్సుల చొప్పున నడపనున్నట్లు ఆయన ప్రకటించారు. నేటి ఉదయం ఈ బస్సులను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాలు ముగిసేదాకా ఈ ఉచిత బస్సులను నడపనున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.