: పుష్కరాలకు అన్నలొస్తారట... పోలీసుల అత్యుత్సాహం!
తెలంగాణలో పుష్కరాలకు ఛత్తీస్ గఢ్ యాత్రికులను ఆహ్వానించడంతో పాటు ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ కు రాకపోకలను పెంచే నిమిత్తం గోదావరిపై ఏటూరునాగారం సమీపంలో నిర్మించిన బ్రిడ్జిని పోలీసులు మూసివేశారు. ఇందుకు వారు చెబుతున్న కారణమే విడ్డూరంగా ఉంది. బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతిస్తే, ఛత్తీస్ గఢ్ లో ఉన్న మావోయిస్టులు సులువుగా వచ్చే వీలు కలుగుతుందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ బ్రిడ్జిని గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారం రోజుల క్రితమే ప్రకటించారు. అధికారికంగా బ్రిడ్జి ప్రారంభం కాకపోయినా, ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు మీదుగా ఛత్తీస్ గఢ్ కు వెళ్లే ప్రజలు ఈ బ్రిడ్జి పైనుంచే రాకపోకలు సాగిస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో రాకపోకలు పెరిగాయి కూడా. ఇప్పుడు అకస్మాత్తుగా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, బ్రిడ్జిని మూసివేయడం, గోదావరి అవతలి వైపు నుంచి వచ్చే వారిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా పోలీసు చెక్ పోస్టును ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. భక్తుల రూపంలో 'అన్న'లు వచ్చి సులువుగా ఇతర జిల్లాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ విభాగం పోలీసు శాఖను అప్రమత్తం చేయడమే ఇందుకు కారణమని సమాచారం. పోలీసుల వాదనను తెలంగాణ సర్కారు అంగీకరించడమే, బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ఆగేలా చేసిందని తెలుస్తోంది.