: వారెవ్వా... దటీజ్ ఇండియన్ ఆర్మీ!
భారత ఆర్మీకి ఎన్నో ప్రత్యేకతలు. కఠినమైన విధులు నిర్వర్తిస్తూనే మానవత్వాన్ని కాపాడడంలో ఇండియన్ ఆర్మీ తరువాతే ఎవరైనా అని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీనికి సాక్ష్యంగా ప్రకృతి విపత్తు సందర్భాల్లో ఇండియన్ ఆర్మీ చేసిన సేవలను చూపించవచ్చు. తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రాహురి సమీపంలో షిర్డీ రోడ్డుపై ఓ భారీ ట్రక్కు బోల్తా పడింది. దీని కింద ఓ వ్యక్తి ఇరుక్కుని, ప్రాణాలకోసం పోరాడుతున్నాడు. అతనిని రక్షించేందుకు స్థానికులు చర్యలు చేపట్టారు. అయితే అతనిని రక్షించడం వారి వల్ల కాలేదు. దీంతో వారికి ఏం చేయాలో తోచడం లేదు. ఇంతలో దేవుళ్లలా ఆర్మీ జవాన్ల ట్రక్కు అటుగా వచ్చింది. వస్తూనే పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్మీ జవానులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగి, కేవలం చేతులతోనే ట్రక్కును పైకి లేపేశారు. కిందనున్న వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆక్కడున్న ప్రతి ఒక్కరూ జవాన్లకు సలాం చేశారు.