: సూపర్ కింగ్స్ తో సంబంధంలేదు, తీర్పు నాకు వర్తించదు... ఎందుకు తప్పుకోవాలి?: శ్రీనీ
ఆర్ఎం లోథా కమిటీ ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో సంచలనాత్మక నిర్ణయాలు వెలువరించడంతో భారత క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై రెండేళ్ల నిషేధం విధించిన కమిటీ... గురునాథ్ మెయ్యప్పన్ (ఇండియా సిమెంట్స్), రాజ్ కుంద్రా (జైపూర్ ఐపీఎల్ ప్రైవేట్ లిమిటెడ్)లపై జీవితకాల నిషేధం విధించింది. లోథా కమిటీ నిర్ణయంపై ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ ను మీడియా స్పందన కోరగా, ఈ విషయంలో మాట్లాడేందుకు ఏముందన్నారు. సీఎస్కేతో తనకు సంబంధం లేదని, లోథా కమిటీ తీర్పు తనకు వర్తించదని, అలాంటప్పుడు తానెందుకు పదవి నుంచి తప్పుకోవాలని ప్రశ్నించారు. శ్రీనివాసన్ కు చెందిన ఇండియా సిమెంట్స్ సంస్థే చెన్నై సూపర్ కింగ్స్ కు యజమాని అన్న సంగతి తెలిసిందే. శ్రీనీ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ఫ్రాంచైజీలో అన్నీ తానై వ్యవహరించి, బెట్టింగ్ కార్యకలాపాలకు తెరదీశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపైనే లోథా కమిటీ విచారణ జరిపింది. కాగా, లోథా కమిటీ తీర్పుపై శ్రీనివాసన్, రాహుల్ ద్రావిడ్ మధ్య లండన్ లో చర్చ జరిగినట్టు సమాచారం. ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. నిషేధం నిర్ణయంతో ద్రావిడ్ కలత చెందినట్టు తెలిసింది.