: 'మోదీ చీరలు' దశ మార్చేస్తాయని భావిస్తున్న బీహార్ బీజేపీ నేతలు


త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు అంటే ఏ రీతిలో ప్రచారం ఉంటుందో తెలిసిందే. ఓటర్లను ఆకట్టుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. స్థాయిని బట్టి తాయిలాలు అందిస్తారు. వార్డు స్థాయి నాయకుడికి ఓ రేటు, గ్రామస్థాయి నాయకుడికి మరో రేటు... ఇలా ప్రతి ఒక్కరికీ ఓ రేటు నిర్ణయించి ఓట్లు కొల్లగొట్టేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తాయి. ఇప్పుడు బీహార్లోనూ అదే సీన్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడంతో పలు రాష్ట్రాల బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో బీహార్ బీజేపీ విభాగం ఈసారి నితీశ్ కుమార్ కు చెక్ పెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థానిక కమలనాథులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, మహిళలను ఆకర్షించగలిగితే సగం పనయినట్టేని వారు నమ్ముతున్నారు. అందుకే 'మోదీ చీరలు' కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే 25 చీరల తయారీదారులకు స్పెషల్ ఆర్డర్లు అందినట్టు తెలిసింది. మొత్తం 10 లక్షల ప్యాకెట్లు అందించాలని నిర్ణయించారట. ఒక్కో ప్యాకెట్ పై మోదీ బొమ్మ, బీజేపీ స్లోగన్ ఉంటాయట. ఈ చీరల వ్యవహారం అంతా ఓ బీజేపీ ఎంపీ పర్యవేక్షిస్తున్నట్టు మీడియా చెబుతోంది. మరి వారి చీరల ఎత్తుగడ ఫలిస్తుందో లేదో చూడాలి!

  • Loading...

More Telugu News