: గొర్రెలకాపరి గెటప్ లో కనువిందు చేసిన సీపీఐ నారాయణ
సీపీఐ జాతీయ నేత కె.నారాయణ కొత్త గెటప్ లో కనిపించి, కనువిందు చేశారు. పంచె కట్టుకుని, ఒక చేత్తో గొడుగు పట్టుకుని, మరో చేత్తో కర్ర పట్టుకుని గొర్రెలను కాస్తూ కనిపించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ గెటప్ లో దర్శనమిచ్చారు. థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం కోసం జపాన్ సంస్థకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న యత్నాలను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా నారాయణ అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, థర్మల్ స్టేషన్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఊళ్లను నిర్మూలించి, ఉద్యోగాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాక్షస చూపు శ్రీకాకుళం జిల్లాపై పడిందని మండిపడ్డారు.