: అర్ధరాత్రి పుష్కర ఘాట్లలో చంద్రబాబు... ఏర్పాట్లపై సునిశిత పరిశీలన
గోదావరి పుష్కరాల సందర్భంగా నిన్న జరిగిన తొక్కిసలాటలో 27 మంది చనిపోయిన వైనం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని తీవ్రంగా కలచివేసినట్లుంది. ప్రమాదం నేపథ్యంలో కంటతడిపెట్టిన చంద్రబాబు, ఏర్పాట్లలో పొరపాట్లు జరిగి ఉంటే క్షమించాలని భక్తులను వేడుకున్నారు. అంతేకాక పుష్కరాలు అయిపోయే దాకా రాజమండ్రిలోనే బస చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన రాజమండ్రిలో ఏర్పాటైన పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లారు. ఘాట్ లలో కలియదిరుగుతూ అక్కడ అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఘాట్లలోనే పుష్కర స్నానం చేయాలన్న భావనను భక్తులు వీడాలని కోరారు. గోదావరి తీరం వెంట ఏర్పాటు చేసిన ఏ ఘాట్ లో పుష్కర స్నానం చేసినా ఒకటేనని సూచించారు. తద్వారా పుష్కర ఘాట్ల వద్ద రద్దీని నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.