: రాష్ట్రపతి ఇఫ్తార్ విందుకు ప్రధాని వెళ్లడం లేదట!
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను పురస్కరించుకుని ఇటు రాష్ట్రాల్లోనే కాక, అటు కేంద్రంలోనూ పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఏర్పాటవుతున్నాయి. ఈ విందుల్లో ముస్లిం సోదరులతో పాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు పార్టీ విభేదాలను పక్కనబెట్టి మరీ హాజరవుతున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ కు బడా రాజకీయ నేతలు హాజరయ్యారు. తాజాగా నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. దేశ ప్రథమ పౌరుడు ఇస్తున్న ఇఫ్తార్ విందుకు అన్ని పార్టీల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ పెద్దలు హాజరుకావాల్సిందే. ఇక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విందుకు మోదీ హాజరుకావడం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నిన్న రాష్ట్రపతి భవన్ కు సమాచారం ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ఆ రాష్ట్రాల సీఎంలతో నరేంద్ర మోదీ నేటి రాత్రి 7 గంటలకు కీలక భేటీ నిర్వహిస్తున్నారని, ఈ కారణంగానే ఆయన రాష్ట్రపతి ఇస్తున్న ఇఫ్తార్ కు హాజరుకాలేకపోతున్నారని పీఎంఓ తన లేఖలో రాష్ట్రపతి భవన్ కు తెలిపిందట. ఇదిలా ఉంటే, గతేడాది రాష్ట్రపతి ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కూడా ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ హాజరుకాలేదట.