: కొబ్బరి చెట్ల ఆకారంలో 4జీ సెల్ టవర్లు...రిలయన్స్ జియో టవర్ల సరికొత్త రూపం
4జీ టెక్నాలజీ సర్వీసులతో త్వరలో రంగప్రవేశం చేయనున్న ‘రిలయన్స్ జియో’ సరికొత్త రూపంలో దూసుకొస్తోంది. చూడటానికి కొబ్బరి చెట్ల ఆకారంలో ఉండే 4జీ సెల్ టవర్లతో ఆ సంస్థ జనాలను ఇట్టే కట్టిపడేస్తోంది. విజయవాడ సమీపంలోని మొఘల్రాజపురం, గుంటూరులోని మంగళ్ దాస్ నగర్ లలో ఇప్పటికే వెలసిన కొబ్బరి చెట్ల ఆకారంలోని ఈ 4జీ సెల్ టవర్లు అక్కడి వారిని బాగా ఆకర్షిస్తున్నాయి. అయినా సెల్ టవర్లేంటీ, కొబ్బరి చెట్ల ఆకారంలో ఉండటమేంటనేగా మీ అనుమానం? సాధారణంగా ఇప్పటిదాకా మనకు చిరపరచితమైన సెల్ టవర్లన్నీ పెద్ద మొత్తంలో స్థలాన్ని ఆక్రమిస్తున్నాయి. అంతేకాక నిర్వహణ వ్యయం కూడా తడిసిమోపెడవుతోంది. స్థలాభావాన్ని నివారించడంతో పాటు భారీ వ్యయానికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన రిలయన్స్ జియో, చైనా-ఇండియా టెక్నాలజీ సహకారంతో ‘కామోప్లాజ్’ టవర్లకు అంకురార్పణ చేేసింది. గాల్వనైజ్ స్టీల్ గొట్టాలను వినియోగించి ఏర్పాటు చేస్తున్న ఈ టవర్లు చూడటానికి అచ్చం కొబ్బరి చెట్లలానే కనిపిస్తున్నాయి. అంతేకాక చెట్ల మాదిరే తక్కువ స్థలంలోనే ఇమిడిపోతున్నాయి. ఈ తరహా సెల్ టవర్లను తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది.