: మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన కోతి... ఎఫ్ఐఆర్ విషయంలో పోలీసులకు సంకట స్థితి!
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగర పోలీసులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కౌసల్ పురి వాసి ఊర్మిళ సక్సేనా సోమవారం దేవాలయానికి వెళుతుండగా ఓ కోతి ఆమె మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించింది. అయితే, సగం గొలుసు మాత్రమే కోతి చేతికి వచ్చింది. సగం గొలుసుతో ఆ వానరం అక్కడినుంచి వెళ్లిపోయింది. ఘటనపై బాధిత మహిళ నజీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ కోతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనంటూ పట్టుబట్టడంతో పోలీసులు సంకట స్థితిలో పడ్డారు. "ఎవరైనా వ్యక్తి గొలుసు లాక్కెళితే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు, కానీ, కోతి గొలుసు లాక్కెళితే ఏ కోతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలో అర్థం కావడంలేదు" అని స్టేషన్ ఇన్ చార్జ్ అఖిలేశ్ గౌర్ వాపోయారు. సంఘటన స్థలానికి వెళ్లి కూడా ఉత్తచేతులతో తిరిగొచ్చారట పోలీసులు. చేసేది లేక మున్సిపాలిటీ వారి సహకారం కోరారు. కోతులను పట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కోరామని గౌర్ తెలిపారు.