: 'అచ్చె దిన్'కు 25ఏళ్లు పడుతుందని అమిత్ షా అనలేదు: బీజేపీ
దేశానికి మంచి రోజులు ('అచ్చె దిన్') రావడానికి మరో 25 ఏళ్లు పడతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనలేదని ఆ పార్టీ ఖండించింది. ఆయనసలు అలాంటి మాటలే చెప్పలేదని పేర్కొంది. సంప్రదాయబద్ధమైన జీవితాన్ని, ప్రాచీన విలువలను కాపాడుకుంటూ ఉన్న దేశంలో మార్పు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని మాత్రమే షా అన్నారని వివరించింది. ఇరవై ఐదు ఏళ్లు పడతాయని చెప్పినట్టు ప్రతిపక్షాలంటున్న మాటలు పూర్తిగా అవాస్తవమని బీజేపీ మండిపడింది. అవినీతిని అరికట్టేందుకు బీజేపీ తీవ్ర కృషి చేస్తోందని బీజేపీ మీడియా సెల్ ఇన్ ఛార్జ్ శ్రీకాంత్ శర్మ అన్నారు. ప్రపంచ నేతగా భారత్ ఎదుగుతుందన్న కల మాత్రం 25 ఏళ్లలో నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.