: అట్రాసిటీ కేసులతో ఏపీ ప్రభుత్వం భయపెడుతోంది: బొత్స
పార్టీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇసుక రవాణాను అడ్డుకున్నందుకే కేసు పెట్టారన్నారు. సహజవనరుల దోపిడీని అడ్డుకుంటున్న వారిని ఏపీ ప్రభుత్వం ఇలా అట్రాసిటీ కేసులతో భయపెడుతోందని ఆరోపించారు. మంత్రి యనమల రామకృష్ణుడు ఇలాకాలో (తుని నియోజకవర్గం) తమ పార్టీ ఎమ్మెల్యే రాజాపై దౌర్జన్యం చేశారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీల రక్షణకోసం పెట్టిన చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. ఇక కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దార్ పై దాడి, ఇసుక వివాదాన్ని స్వయంగా ముఖ్యమంత్రే సెటిల్ చేశారని, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. వివాదాన్ని సెటిల్ చేసే సమయం ఉందిగానీ మున్సిపల్ కార్మికులతో చర్చించేందుకు మాత్రం సీఎంకు సమయం లేదా? అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.