: లిక్కర్ కింగ్ మాల్యాకు ఎదురుదెబ్బ!...ఈడీ విచారణను నిలిపివేయలేమన్న సుప్రీంకోర్టు
లిక్కర్ కింగ్ గా పేరుగాంచిన యునైటెడ్ బ్రూవరీస్ అధినేత విజయ్ మాల్యాను ఆయన వ్యాపారాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. చివరకు తన వ్యక్తిగత ప్రయాణాల కోసం ముచ్చటపడి కొనుగోలు చేసిన చిన్న విమానాన్ని కూడా ఆయన వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆయనకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. యునైటెడ్ బ్రూవరీస్ నిధుల పంపిణీలో భారీ అవకతవకలు జరిగాయన్న బహుళజాతి సంస్థ డియోజియో ఫిర్యాదు నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మాల్యా కంపెనీల ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తునకు ఈడీ అధికారులు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే దీనిపై భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాల్యా, ఈడీ విచారణను నిలిపివేయాలని పిటీషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మాల్యా అభ్యర్థనను తోసిపుచ్చింది. మాల్యా సంస్థలపై ఈడీ దర్యాప్తును నిలిపివేయజాలమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.