: చంద్రబాబు కేబినెట్ లో దేవాదాయ మంత్రిపై వివక్ష...తేనెతుట్టను కదిపిన బీజేపీ నేత కన్నా!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేబినెట్లో బీజేపీ నేత, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పైడికొండల మాణిక్యాలరావుపై వివక్ష సాగుతోందట. ఈ మేరకు నిన్న బీజేపీ ఏపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడ్డారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల పనులకు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావును చంద్రబాబు దూరంగా పెడుతున్నారని కన్నా ఆరోపించారు. మాణిక్యాలరావును కలుపుకొని పోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాము పూర్తిగా అసంతృప్తితో ఉన్నామని కన్నా వ్యాఖ్యానించారు. పుష్కరాల్లో దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మాణిక్యాలరావు పాల్గొనాల్సి ఉన్నా, ఆ పరిస్థితులు లేవని కూడా ఆయన నిరసన వ్యక్తం చేశారు. తద్వారా ఏపీలోనే కాక కేంద్రంలోనూ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీల మధ్య విభేదాల తేనెతుట్టను కన్నా కదిపినట్లైంది. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.