: సంజయ్ దత్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
1993నాటి బాంబు పేలుళ్ల కేసులో శిక్ష పడి మానసిక వేదనను అనుభవిస్తున్న నటుడు సంజయ్ దత్ కు మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. తాజాగా ఆయనపై ముంబై కోర్టు ఒకటి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ''సంజయ్ దత్ కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధం ఉంది. ఆయన ప్రోద్బలంతోనే నన్ను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయి'' అంటూ నిర్మాత షకీల్ నూరాని కేసు దాఖలు చేశారు. విచారణకు సంజయ్ గైర్హాజరు అయినందున కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సంజయ్ తనతో ఒక చిత్రం చేసేందుకు 2002లో ఒప్పందం కుదుర్చుకుని దానిని ఉల్లంఘించారని నూరాని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సంజయ్ తనకు 50లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉందని, ఒప్పందం ఉల్లంఘన వల్ల తనకు 2కోట్లు నష్టం వాటిల్లిందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో సంజయ్ మాఫియా నేతలతో ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారని నూరాని కోర్టుకు తెలిపారు. 1993నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించేందుకు వీలుగా లొంగిపోవడానికి నెలపాటు గడువిస్తూ సుప్రీం ఇటీవలే తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అంతలోనే అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంజయ్ కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది.