: ఐదారంకెల వేతనాన్ని వదిలి ఎంటర్ ప్రెన్యూర్లుగా మారుతున్న యువత... ఎందుకంటే!
తండ్రులతో కొడుకులు పోటీలు పడుతున్నారు. పారిశ్రామికవేత్తలుగా, వ్యాపార దిగ్గజాలుగా, ఐటీ కంపెనీల వ్యవస్థాపకులుగా నిలిచేందుకు యువత క్యూ కడుతోంది. మంచి మంచి కంపెనీల్లో అద్భుత వేతనాలు అందుకుంటున్న వారు ఔత్సాహికులుగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ముంబైలోని పురందారే కుటుంబం ఇందుకో చక్కని ఉదాహరణ. ఈ కుటుంబంలో తండ్రి జైరాజ్ వ్యాపారం నిర్వహిస్తూ, విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకుంటే, యేల్ వర్శిటీలో గ్రాడ్యుయేట్ అయి మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ కంపెనీ 'బూజ్'లో పనిచేస్తున్న కొడుకు వరుణ్ (25), దాన్ని వదిలేసి సొంత స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. తండ్రి వ్యాపారాన్ని కొనసాగించడం కంటే, తనదైన మార్గంలో సత్తా చాటాలన్నది అతని అభిమతం. ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. ఉన్నత విద్యను అభ్యసించిన ఎంతో మంది భారతీయులు మంచి ఉద్యోగాల్లో చేరి ఆపై వాటిని వదిలేసి ఎంటర్ ప్రెన్యూర్లుగా అవతారం ఎత్తుతున్నారు. చేస్తున్న ఉద్యోగంలో స్థిరపడిన తరువాత కొందరు బయటకు వస్తుంటే, మరికొందరు మొదట్లోనే తాము ఇంకేదో చేయాలన్న ఉత్సుకతతో కొత్త కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా పీడబ్ల్యూసీ, కేపీఎంజీ వంటి ఆర్థిక సేవల సంస్థల నుంచి బయటకొచ్చి అవే తరహా ఆడిట్ సంస్థలను ప్రారంభిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ రంగంలో అపారమైన వ్యాపార అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం. ఒక్క ఆర్థిక సేవారంగమే కాదు, ఐటీ ఇండస్ట్రీతో పాటు రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, రిటైల్ ఫుడ్ చెయిన్, ఈ-కామర్స్ వంటి విభాగాల్లోనూ స్టార్టప్ సంస్థల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.