: డీ ఫర్ దారూ, పీ ఫర్ పీయో... ఓ తాగుబోతు టీచర్ నిర్వాకం!
చత్తీస్ గఢ్ లోని కోరెయా జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఓ టీచర్ మద్యం తాగాలని ప్రబోధిస్తున్నాడు. డీ ఫర్ దారూ (మద్యం), పీ ఫర్ పీయో (తాగు) అని బోర్డుపై రాయడమే కాకుండా, వాటిని విద్యార్థులతో వల్లె వేయిస్తున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీయగా, అవి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. తాను మద్యం తాగి వచ్చానని కెమెరా ముందు చెప్పిన టీచర్ శివ్ బారన్, తాను చాలాసార్లు అలానే వచ్చానని చెప్పడం గమనార్హం. మరి మద్యం తాగమని పిల్లలకు ఎందుకు చెబుతున్నావని ప్రశ్నించగా, తాను సిలబస్ ప్రకారం కూడా పాఠాలు చెబుతానని అంటూ, ఇకపై తాగి స్కూలుకు రానని మొరపెట్టుకున్నాడు. ఈ విషయంలో సదరు టీచరుపై చర్యలు తీసుకునేందుకు విద్యా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.