: వింబుల్డన్ చాంప్ సెరెనా...ఖాతాలో ఆరో టైటిల్
వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఛాంపియన్ గా సెరెనా విలియమ్స్ నిలిచింది. ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి ముగురుజాపై 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. దీంతో సెరెనా వింబుల్డన్ టైటిల్ ను ఆరోసారి తన ఖాతాలో వేసుకుంది. ఈ టైటిల్ తో మొత్తం 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సెరెనా సాధించింది. ఫైనల్ లో సెరెనాకు ముగురుజా గట్టి పోటీ ఇచ్చింది. అయితే సెరెనా అనుభవం ముందు చివరికి ఆమె తలవంచింది. ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లు, ర్యాలీ, వ్యాలీలతో చెలరేగిన సెరెనా ఫైనల్లో పూర్తిస్థాయి ఆటతీరు ప్రదర్శించింది. సెరెనాకు దీటైన ఆటను ప్రదర్శించినప్పటికీ కీలక సమయాల్లో సెరెనా సర్వీసును ముగురుజా నిలువరించలేకపోయింది. దీంతో ముగురుజా పరాజయం చవిచూసింది. రేపు పురుషుల సింగిల్స్ ఫైనల్ లో రోజర్ ఫెదరర్, జకోవిచ్ తలపడనున్నారు. ఇద్దరు దిగ్గజాల మధ్య సమరం హోరాహోరీగా సాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. రేపటి మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.