: ప్రస్తుతం భారతదేశ జనాభా ఎంతో తెలుసా?
భారత దేశ ప్రస్తుత జనాభా ఎంతో తెలుసా? అక్షరాల 127, 42, 39, 769కి మన జనాభా చేరింది! ఇది ప్రపంచ జనాభాలో 17.25 శాతం. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ పాపులైజేషన్ స్టెబిలైజేషన్ ఫండ్ (ఎన్ పీఎస్ఎఫ్) భారత జనాభా నివేదికను విడుదల చేసింది. ఏడాదికి 1.6 శాతం చొప్పున భారతదేశ జనాభా పెరుగుతున్నట్టు ఎన్ పీఎస్ఎఫ్ తెలిపింది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారత జనాభా 163 కోట్లను దాటుతుందని, అప్పుడు చైనా కంటే జనాభా ఎక్కువ గల దేశంగా భారత్ అవతరిస్తుందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం చైనా జనాభా 137 కోట్లను దాటింది. దీంతో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనా నిలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లు. ప్రస్తుతం భారత జనాభా అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాకు సమానంగా ఉంది.