: ఇక ‘మేడా’ వంతు... ఉపాధ్యాయురాలిపై ప్రభుత్వ విప్ వర్గీయుల దాడి
ఇప్పటికే కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన విషయంపై ఏపీలో టీడీపీ సర్కారు తల పట్టుకుంది. చింతమనేని దాడిపై ఆందోళనకు దిగిన రెవెన్యూ ఉద్యోగులు మంత్రుల రాయబారానికి కరగలేదు. సాక్షాత్తు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం హోదాలో ఉన్నతస్థాయి విచారణకు హామీ ఇచ్చిన తర్వాత కాని వారు తమ ఆందోళనను విరమించలేదు. ఈ వ్యవహారంపై హైదరాబాదులో రెవెన్యూ ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతుండగానే, కడప జిల్లాలో ఈ తరహాలోనే మరో ఘటన జరిగింది. అక్కడి వివాదానికి కూడా ప్రభుత్వ విప్ గా ఉన్న మరో ఎమ్మెల్యేనే కారణం కావడం గమనార్హం. కొద్దిసేపటి క్రితం కడప జిల్లా ఒంటిమిట్టలో ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి వర్గీయులు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై దాడికి దిగారు. ఒంటిమిట్ట పర్యటనకు వచ్చిన మల్లికార్జునరెడ్డి వద్దకెళ్లిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం లేదని ఫిర్యాదు చేశారు. అంతేకాక సదరు సమస్యను వీలయినంత త్వరగా పరిష్కరించాలని కూడా ఆమె అభ్యర్థించారట. దీంతో తమ నేతకే ఫిర్యాదు చేస్తావా? అంటూ ఊగిపోయిన మల్లికార్జునరెడ్డి వర్గీయులు సదరు ఉపాధ్యాయురాలిపై దాడికి దిగారు. దీంతో కంగుతిన్న ఉపాధ్యాయురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మేడా వర్గీయులపై ఫిర్యాదు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న మేడా వర్గీయులు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సదరు ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదు చేశారట.