: ఫలించిన చంద్రబాబు మంత్రాంగం...సోమవారం నుంచి విధుల్లోకి ఏపీ రెవెన్యూ సిబ్బంది
కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి నేపథ్యంలో ప్రభుత్వం, రెవెన్యూ సిబ్బంది మధ్య నెలకొన్న విభేదాలు ఎట్టకేలకు సమసిసోయాయి. మూడు రోజులుగా తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి మరీ నిరసనలకు దిగిన రెవెన్యూ సిబ్బందితో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నెరపిన మంత్రాంగం ఎట్టకేలకు ఫలించింది. సోమవారం నుంచి యథావిధిగా విధులకు హాజరవుతామని దాడి బాధితురాలు వనజాక్షి స్వయంగా మీడియాకు తెలిపారు. హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో నేటి ఉదయం రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు తహశీల్దార్ వనజాక్షి, నిందితుడు చింతమనేనిలతో భేటీ అయిన చంద్రబాబు ఘటనపై ఇరువర్గాల వాదనలు సావధానంగా విన్నారు. ఆ తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పిన చంద్రబాబు, ఇందుకోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఓ కమిటీని నియమిస్తామని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో శాంతించిన రెవెన్యూ ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుంచి యథావిధిగా విధులకు హాజరవుతామని వారు పేర్కొన్నారు.