: అమెరికా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన బాహుబలి... అమీర్ ఖాన్ 'పీకే' కలెక్షన్లను అధిగమించింది!
తెలుగు సినిమా గొప్పదనాన్ని నలుమూలలా చాటాలనుకున్న దర్శకుడు రాజమౌళి కల వాస్తవరూపం దాల్చింది. భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి సెట్టింగులు, పాత్రల్లో ఒదిగిపోయిన నటీనటులు, ఆకాశాన్నంటిన అంచనాలు, ఏదైతేనేం... అగ్రరాజ్యం అమెరికాలో బాహుబలి చరిత్ర సృష్టించింది. బాక్సాఫీసును బద్దలు కొట్టింది. అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల్లో... తొలిరోజు కలెక్షన్లలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన 'పీకే'దే ఇప్పటి వరకు రికార్డ్. ఈ క్రమంలో మన బాహుబలి పీకేను అధిగమించింది. పీకే సినిమా అమెరికాలో తొలి రోజు 0.97 మిలియన్ డాలర్ల(6 కోట్ల 15 లక్షలు)ను వసూలు చేస్తే... బాహుబలి ఏకంగా 1.30 మిలియన్ డాలర్ల(8 కోట్ల 24 లక్షలు)ను కొల్లగొట్టింది. రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్ కొనసాగితే... పీకే కలెక్షన్స్ రికార్డులను చెరిపివేసే అవకాశాలను కొట్టిపారేయలేం.