: ‘ట్యాపింగ్’ పరికరాల కొనుగోలుకు 'ఏపీ' యత్నం...వికీలీక్స్ ను ఉటంకిస్తూ ఆంగ్ల పత్రిక కథనం


ఓటుకు నోటు కేసు దరిమిలా ఫోన్ ట్యాపింగ్ పరికరాల కోసం ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ‘వికీలీక్స్’ను ఉటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నేటి సంచికలో ఆసక్తికర కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం... తెలంగాణ సర్కారు సీఎం చంద్రబాబు సహా తమ రాష్ట్రానికి చెందిన 120 మందికి చెందిన ఫోన్లపై ట్యాపింగ్ అస్త్రం ప్రయోగించిందని ఆరోపిస్తున్న ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా, సదరు పరికరాల కోసం ప్రయత్నించారట. ఈ ట్యాపింగ్ టెక్నాలజీ సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ క్రమంలో ఈ తరహా పరికరాలు సరఫరా చేసే ఇటలీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థతో వారు సంప్రదింపులు జరిపారట. ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాల సంప్రదింపుల నేపథ్యంలో, వీరి తరఫున హైదరాబాదుకు చెందిన ఓ సంస్థ ‘హాకింగ్ టీమ్.కామ్’ అనే ఇటలీ సంస్థతో ఈ పరికరాల కోసం ఈ మెయిళ్ల ద్వారా లావాదేవీ జరిపినట్టు సదరు పత్రిక పేర్కొంది. దక్షిణాదికి చెందిన ఓ రాష్ట్రానికి ట్యాపింగ్ పరికరాలు అవసరమని ఆ మెయిల్ లో సదరు సంస్థ పేర్కొంది. మరోచోట తమ క్లయింటు ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని స్పష్టంగా ఆ మెయిల్ లో వెల్లడించింది. ఈ మెయిళ్లను పట్టేసిన వికీలీక్స్, వీరి యత్నాలను వెలుగులోకి తెచ్చిందని ఆ పత్రిక కథనం పేర్కొంది. అంతేకాక ఈ వ్యవహారం మొత్తం ఓటుకు నోటు కేసు వెలుగుచూసిన తర్వాత జరిగినవేనని ఆ కథనం పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News