: గవర్నర్ ఇఫ్తార్ విందుకు ఇద్దరు సీఎంలూ డుమ్మా!
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇఫ్తార్ విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇద్దరూ డుమ్మా కొట్టారు. నిన్న సాయంత్రం రాజ్ భవన్ లో జరిగిన ఈ విందుకు ఏపీ, తెలంగాణలకు చెందిన డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, మహమూద్ అలీలతో పాటు అసెంబ్లీ స్పీకర్లు, మండలి చైర్మన్లతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. జపాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. అనివార్య కారణాల వల్లే గవర్నర్ ఇఫ్తార్ విందుకు హాజరుకాలేకపోతున్నానని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారని మొన్న తెలంగాణ సీఎంఓ ప్రకటించింది. అయితే ఆయన కూడా డుమ్మా కొట్టారు. దీనిపై అటు కేసీఆర్ కాని, ఇటు ఆయన కార్యాలయం (సీఎంఓ) కాని ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.