: చైనా దిశగా దూసుకువస్తోన్న 'చాన్ హామ్'
చైనా ప్రజలు ఇప్పుడు ఓ సూపర్ టైఫూన్ భయంతో వణికిపోతున్నారు. 'చాన్ హామ్' అని ఈ టైఫూన్ కు నామకరణం చేశారు. ఇప్పుడిది ఆగ్నేయ చైనా తీరం దిశగా దూసుకువస్తోంది. చాన్ హామ్ కారణంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు వీస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శనివారం ఉదయం నాటికి ఈ భీకర ఉత్పాతం ఫుజియాన్, ఝెజియాంగ్ ప్రావిన్స్ లపై విరుచుకు పడవచ్చని చైనా జాతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మేరకు అత్యంత తీవ్ర ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఝెజియాంగ్ ప్రాంతంలో దాదాపు 60 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 100కు పైగా రైళ్లను రద్దు చేశారు. కాగా, ఈ సూపర్ టైఫూన్ కారణంగా ఉత్తర ఫిలిప్పీన్స్ లో కుండపోత వర్షాలు కురిశాయి. అటుపై తైవాన్ పై ప్రభావం చూపి, ఇప్పుడు చైనా దిశగా దూసుకువస్తోంది.