: కారు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? మీకోసం 10 కొత్త కార్లు... ధర రూ. 2.5 లక్షల నుంచి మొదలు


2015 తొలి ఆరు నెలల కాలంలో వాహన అమ్మకాలు సంతృప్తికరంగానే సాగాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోటా వంటి ఆటో కంపెనీలు స్థిరమైన ప్రగతిని చూపాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు పూర్వవైభవం కోసం కొత్త ప్లాన్లు వేస్తున్నాయి. రానున్న పండగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించి కార్ల అమ్మకాలు పెంచుకునేందుకు పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. రూ. 2.5 లక్షల ప్రారంభధర నుంచి రూ. 50 లక్షల వరకూ విలువైన పలు కార్లు మార్కెట్లో పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరులోగా మార్కెట్లోకి రానున్న 10 కొత్త కార్ల వివరాలివి. మారుతి సుజుకి ఎస్-క్రాస్: ఈ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టులో ఇది మార్కెట్లోకి రానుండగా, ఇప్పటికే వేల సంఖ్యలో ప్రీబుకింగ్స్ అయిపోయాయి. 1.3 లీటర్, 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్లలో లభించే ఈ కారు ధర రూ. 6.5 లక్షల నుంచి రూ. 9.5 లక్షల మధ్య ఉంటుంది. మారుతి సుజుకి వైఆర్ఏ ప్రీమియం హ్యాచ్ బ్యాక్: హ్యుందాయ్ ఐ20, హోండా జాజ్ కు గట్టి పోటీని ఇస్తుందని విశ్లేషకులు నమ్ముతున్న కారు ఇది. 1.0 టర్బో చార్జ్ పెట్రో ఇంజను, 1.3 లీటర్ డీజిల్ ఇంజను వేరియంట్లలో లభించే కారు ధర రూ. 5.5 లక్షల నుంచి రూ. 8.5 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు డిసెంబరులోగా మార్కెట్లోకి వస్తుందని సమాచారం. హ్యుందాయ్ క్రెటా కాంపాక్ట్ ఎస్ యూవీ: ఈ వెహికల్ 21వ తేదీన మార్కెట్లోకి రానుంది. రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రానో, మారుతి సుజుకి ఎస్-క్రాస్ కార్లకు ఇది గట్టి పోటీని ఇవ్వనుందని తెలుస్తోంది. 1.4 లీటర్, 1.6 లీటర్ సీఆర్డీఐ డీజిల్, 1.6 లీటర్ వీటీవీటీ పెట్రోల్ ఇంజను సహా మూడు వేరియంట్లలో లభించే కారు ధర రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉండనుంది. రెనాల్ట్ క్విడ్: ఈ సంవత్సరం మల్టీ పర్పస్ వెహికల్ 'ది లాడ్జ్'ని విడుదల చేసిన రెనాల్ట్ 800 సీసీ వేరియంట్ లో హ్యాచ్ బ్యాక్ కారుగా క్విడ్ ను ఆవిష్కరించనుంది. సెప్టెంబరులో విడుదలయ్యే ఈ కారు ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 4లక్షల మధ్య ఉంటుంది. మహీంద్రా ఎస్ 101 మినీ ఎస్ యూవీ: పలు కొత్త ప్రొడక్టుల తయారీలో నిమగ్నమైన ఎంఅండ్ఎం సరికొత్త చిన్న ఎస్ యూవీని ఈ పండగ సీజనులో పరిచయం చేయనుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజనుతో లభించే దీని ధర రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ గా యూ 301 కాంపాక్ట్ ఎస్ యూవీ కూడా విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 8.5 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్: ఫిబ్రవరి 2014లో ఫోర్డ్ ప్రకటించిన ఫిగో ఆస్పైర్ కారు ఆగస్టులో మార్కెట్లోకి విడుదల కానుంది. 1.5 లీటర్ డీజిల్, 1 లీటర్ ఎకో బూస్ట్ పెట్రోల్ ఇంజను వేరియంట్లలో లభించే ఈ కారు ధర రూ. 5 లక్షల నుంచి రూ. 7.50 లక్షల మధ్య ఉంటుంది. టాటా కైట్ ట్విన్స్: ఇక నానో తరువాత అందరికీ అందుబాటు ధరలో ఉండే కారంటూ టాటా మోటార్స్ పరిచయం చేయనున్న సరికొత్త కారు కైట్ ట్విన్స్. 1.2 లీటర్ పెట్రోల్, 1.05 త్రీ సిలిండర్ డీజిల్ ఇంజను వేరియంట్లలో లభించే ఈ కారు ధర రూ. 2.5 లక్షల నుంచి రూ. 4.5 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ కార్లు డిసెంబర్ లోగా, లేదా సంక్రాంతి సీజనులో విడుదల చేయాలన్నది టాటాల అభిమతం. శెవరొలెట్ ట్రయల్ బ్లేజర్: జనరల్ మోటార్స్ మార్కెటింగ్ చేస్తున్న పికప్ ట్రక్ కొలొరాడో ఫ్రేమ్ చాసిస్ పై శెవరొలెట్ అందిస్తున్న ఎస్ యూవీయే ఈ ట్రయల్ బ్లేజర్. 2.8 లీటర్ డీజిల్ ఇంజనుపై 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ఈ కారు లభిస్తుంది. దీని ధరను మాత్రం సంస్థ వెల్లడించలేదు. టయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పాజిరో, హ్యందాయ్ శాంతా ఫేలతో పాటు త్వరలో రానున్న ఫోర్డ్ ఎండీవర్ కు ఇది గట్టి పోటీ ఇస్తుందని సమాచారం. ఫోర్డ్ న్యూ ఎండీవర్: ఫోర్డ్ సంస్థ సరికొత్త ఎండీవర్ వేరియంట్ ను ఈ పండగ సీజనులో విడుదల చేయనుంది. 2.2 లీటర్ 4 సిలిండర్ డీజిల్, 3.2 లీటర్ 5 సిలిండర్ డీజిల్ వేరియంట్లుగా సెప్టెంబరులో మార్కెట్ ను తాకనున్న ఈ వాహనం ఖరీదు రూ. 22 లక్షల నుంచి రూ. 28 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ఇక మీ బడ్జెటుకు తగ్గట్టుగా ఏ కారును ఎంచుకుంటారో మీ ఇష్టం.

  • Loading...

More Telugu News