: ‘బాహుబలి’ థియేటర్ వద్ద ఉద్రిక్తత...మహబూబాబాద్ లో యువకుల రాళ్లదాడి, పోలీసులకు గాయాలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. నేటి ఉదయం ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్ల వద్ద భారీ జన సందోహం నెలకొంది. టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ‘బాహుబలి’ థియేటర్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. టికెట్ల కోసం ఒక్కసారిగా ప్రేక్షకులు చొచ్చుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. తమను నిలువరించే క్రమంలో లాఠీలకు పనిచెప్పిన పోలీసులపై ప్రేక్షకులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.