: అది ఘోరమైన తప్పు... హేమమాలినిపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తీవ్ర విమర్శ
ఒకప్పటి డ్రీమ్ గర్ల్, బీజేపీ పార్లమెంటు సభ్యురాలు హేమమాలినిపై సొంత పార్టీ నుంచి తొలిసారిగా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల చిన్న పాప మరణించిన ఘటనలో పాప తండ్రిదే తప్పని ఆమె చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఖండించారు. ఆ వ్యాఖ్యలు చేసి ఆమె ఘోరమైన తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఆమెతో పాటు గాయపడినవారిని కూడా ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. "ప్రమాదం జరిగిన సమయంలో హేమాజీ సహా అక్కడున్న అందరూ తప్పుచేశారు. చిన్నారిని నడిరోడ్డుపై వదిలేయడం ఘోరమైన తప్పిదం" అని ఆయన విమర్శించారు. సుమారు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న హేమమాలినీ మెర్సిడిస్ బెంజ్ కారు మరో చిన్న కారును ఢీకొన్న ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే.