: ఆర్బీఐ గవర్నర్ ను ఆశ్చర్యపరిచిన విద్యార్థి
అమెరికా డాలర్ గమనంపై ఆధారపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడుస్తున్న ప్రస్తుత కాలంలో ముంబయి బాలుడు అడిగిన ప్రశ్న భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ను ఆశ్చర్యపరిచింది. ఓ కార్యక్రమంలో భాగంగా, ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కు కాస్త క్లిష్టమైన ప్రశ్న సంధించాడు. భారత కరెన్సీ రూపాయి ఎప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుందని అడిగాడు. ఆ రోజు ఎప్పుడు వస్తుందన్న బాలుడికి కాస్త ఆలోచించి సమాధానం చెప్పారు రాజన్. రూపాయి బలోపేతానికి రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని, అవసరమైన ప్రణాళికలు రచిస్తుందని తెలిపారు. ఆ బాలుడు పెద్దవాడయ్యే సరికి రూపాయి శక్తి పెరుగుతుందని చెప్పారు. అప్పటికి భారత్ ప్రపంచ ఆర్థిక శక్తుల్లో తొలి మూడు స్థానాల్లో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఆ ప్రశ్న అడిగిన బాలుడిని రాజన్ అభినందించారు.