: కాంగ్రెస్ నేతలకు ఆ అర్హత ఉందా?: హరీష్ రావు


'కాంగ్రెస్ నేతలా మమ్మల్ని విమర్శించేది?' అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులను అక్రమంగా కడుతుంటే మాట్లాడని కాంగ్రెస్ నేతలు ప్రాణహిత-చేవెళ్లపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాట్లాడని నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 'అవినీతికి పాల్పడేందుకు నీళ్లు రాని ప్రాజెక్టులు, కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టినా పట్టించుకోని కాంగ్రెస్ నేతలా, టీఆర్ఎస్ పై విమర్శలు చేసేది?' అని నిలదీశారు. రైతులను కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు నీరిస్తే, ఇక తమకు పుట్టగతులు ఉండవని కాంగ్రెస్ నేతల్లో భయం మొదలైందని, అందుకే అవాకులు చవాకులు పేలుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాదరణ లేని కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ ను విమర్శించే అర్హత లేదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News