: ప్రేమ కోసం వేషం మార్చి అడ్డంగా దొరికిన యువతి!
తనకన్నా 12 ఏళ్లు తక్కువ వయసున్న యువకుడిని ప్రేమించి, అతన్ని సొంతం చేసుకునేందుకు వేషం మార్చిన ఓ యువతి అడ్డంగా దొరికిపోయింది. హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కె. శివానీ (33) అనే మహిళ పలు ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆయాగా పనిచేసేది. 2002లో వివాహం కాగా, 2013లో భర్త బాలయ్య ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శివానీకి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కొంత కాలం క్రితం నగరానికి వచ్చిన ఆమె కర్మన్ ఘాట్ లో ఓ గది అద్దెకు తీసుకుని నివసిస్తూ, తాను గాంధీ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నట్టు ప్రచారం చేసుకుంది. బేగంపేటకు చెందిన ఓ యువకుడితో (20) పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ప్రియుడితో కూడా చేస్తున్న పనిపై అబద్ధాలే చెప్పింది. తాను ఆసుపత్రికి వస్తానని ఆ యువకుడు అడుగుతుండగా, కొంతకాలం దాటేసిన శివానీ, ఇక తప్పదనుకొని ఓ ప్లాన్ వేసుకుంది. వైద్యులు వేసుకునే ఏప్రాన్, స్టెత స్కోప్ లను కొనుగోలు చేసింది. గాంధీ ఆసుపత్రి ఓపీ విభాగంలో ఉన్నానని, అక్కడికి రమ్మని ప్రియుడికి ఫోన్ చేసింది. ప్రియుడు అక్కడికి వెళ్లేసరికి వైద్యురాలి వేషంలో ఇతరులకు ఆర్డర్లిస్తూ కనిపించింది. ప్రియుడైతే నమ్మాడు. కానీ సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చి ఆరా తీసి విషయం పోలీసులకు చేరవేశారు. దీంతో అసలు సంగతి బయటపడి ప్రియుడి కోసం వేషం మార్చిన యువతి కటకటాల వెనక్కు వెళ్లింది.