: కర్నూలులో నకిలీ సీబీఐ అధికారి హల్ చల్...ఉద్యోగాల పేరిట రూ.30 లక్షల వసూలు
నకిలీ ఐఏఎస్ అధికారులు వచ్చివెళ్లారు. నకిలీ పోలీసులు కూడా జనానికి టోపీలేశారు. తాజాగా నకిలీ సీబీఐ అధికారి రంగప్రవేశం చేశాడు. అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపే సీబీఐలో పనిచేస్తున్నానని చెబుతూనే ఉద్యగాలిప్పిస్తానన్న ఓ యువకుడి మాటలను కర్నూలు జనం గుడ్డిగా నమ్మేశారు. అతడు అడిగిన మేరకు సమర్పించుకున్నారు. తీరా అతడు నకిలీ సీబీఐ అధికారి అని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. బాధితులంతా కలిసి పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ సీబీఐ అధికారి కటకటాల వెనక్కెళ్లాడు. వివరాల్లోకెళితే, కిరణ్ కుమార్ అనే యువకుడు తాను సీబీఐ అధికారినని చెప్పుకుని కర్నూలులో రంగప్రవేశం చేశాడు. ఉద్యోగాలిప్పిస్తానని చాలా మందిని నమ్మించేశాడు. దాదాపు 20 మంది నిరుద్యోగుల నుంచి రూ.30 లక్షలను వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బు కట్టిన బాధితులు ఆరా తీయగా, కిరణ్ కుమార్ భాగోతం బట్టబయలైంది. కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నారు.