: డిసెంబర్ లోగా రానున్న 'హాటెస్ట్ గాడ్జెట్స్' ఇవే!


2015 సగం గడిచిపోయింది. అయితే, తొలి ఆరు నెలల కాలంలో టెక్ ప్రియులను మురిపించి మెరిపించిన గాడ్జెట్స్ పెద్దగా ఏమీ విడుదల కాలేదు. ఆ లోటును ఈ పండగ సీజనులో తీరుస్తామని అంటున్నాయి యాపిల్, గూగుల్, శాంసంగ్ తదితర కంపెనీలు. ఈ సంస్థలన్నీ కొత్త ఉత్పత్తులను సిద్ధం చేసుకుంటున్నాయి. 2015 ముగిసేలోగా మార్కెట్లోకి రానున్న 'హాటెస్ట్ గాడ్జెట్స్' ను ఒకసారి పరిశీలిస్తే... ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల ధరతో పోలిస్తే చౌక ధరలో 'వన్ ప్లస్ 2' ఈ నెల 27న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ ఫోన్ ను పరిశీలించిన నిపుణులు దీని పనితీరు సైతం సంతృప్తికరమని ఇప్పటికే విశ్లేషణలు రాశారు. టచ్ ఐడీ కన్నా మెరుగ్గా పనిచేసే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ కు అదనపు ఆకర్షణ. ఈనెలాఖరులోగా మార్కెట్లోకి రానుంది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. 29వ తేదీన విండోస్ 10ను అధికారికంగా విడుదల చేస్తామని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. సంప్రదాయ విండోస్ అనుభూతిని కోరుకునే వారికోసం దీన్ని రూపొందించినట్టు సంస్థ చెబుతోంది. ఇక యాపిల్ సంస్థ ఐఫోన్-6ఎస్ ను సెప్టెంబరులో ప్రపంచానికి పరిచయం చేయనుంది. మరింత మెరుగైన కెమెరా, యాపిల్ వాచ్ లో వాడిన ఫోర్స్ టచ్ స్క్రీన్ దీనికి ఆకర్షణలని తెలుస్తోంది. ఐఫోన్ 6, 6 ప్లస్ వేరియంట్లను ఒకేసారి విడుదల చేయడానికి యాపిల్ సన్నాహాలు చేస్తోంది. తదుపరి వర్షన్ ఐఓఎస్-9 కూడా సెప్టెంబరులోనే విడుదల కానుంది. ఐఫోన్లకు కొత్త సాఫ్ట్ వేర్ గా ఇది మార్కెట్లోకి రావడంతోనే మంచి అమ్మకాలు సాగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో మరిన్ని కొత్త ఫీచర్లు, పక్కపక్కనే యాప్స్ నడుపుకునేలా మల్టీ విండోస్ సిస్టమ్ తదితరాలు ఉంటాయని సమాచారం. ఇదే నెలలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 5, ఎస్6 ఎడ్జ్ ప్లస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయనుంది. ఇటీవలి ఐఎఫ్ఏ ఎక్స్ పోలో శాంసంగ్ వీటిని తొలిసారిగా ప్రపంచానికి చూపిన సంగతి తెలిసిందే. 4కే రెజల్యూషన్, 16 ఎంపీ రియర్ కెమెరా ఈ ఫోన్ స్పెషాలిటీ. సెప్టెంబరులోనే రానున్న మరో గాడ్జెట్ మోటారోలా 'మోటో ఎక్స్ (జన్ 3)' గత సంవత్సరం విడుదలైన మోటో ఎక్స్ ఫోన్ కు అప్ డేట్ వర్షన్ గా ఈ ఫోన్ రానుంది. ఈ ఫోన్లోని ప్రత్యేకతలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. అయితే, దీర్ఘకాలం మన్నే బ్యాటరీ, మెరుగైన బ్యాటరీ, అధిక రెజల్యూషన్ కలిగిన స్క్రీన్ ఉంటాయని తెలుస్తోంది. ఇక అక్టోబరు విషయానికి వస్తే అందరూ ఎదురుచూస్తున్న గూగుల్ నెక్సస్ ఫోన్లలో రెండు వేరియంట్లు విడుదల కానున్నాయి. గత రెండేళ్లుగా అక్టోబరులోనే నెక్సస్ ఫోన్లను ఆవిష్కరిస్తున్న గూగుల్ ఈ దఫా రెండు ఫోన్లను విడుదల చేస్తుంది. వీటిల్లో ఒకటి 5.2 అంగుళాలు, మరొకటి 5.7 అంగుళాల స్క్రీన్లను కలిగివుంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ల గురించి మరింత సమాచారం వెలువడాల్సి వుంది. ఈ సంవత్సరంలోనే ఆండ్రాయిడ్ ఎం ఆపరేటింగ్ సిస్టమ్ ను విడుదల చేస్తామని ప్రకటించిన గూగుల్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. 'ఎం' విడుదలైతే స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో పెను మార్పు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే నెలలో యాపిల్ తన తొలి లార్జ్ స్క్రీన్ ఐపాడ్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 12.9 అంగుళాల ఐపాడ్ తో పాటు 13 అంగుళాల మాక్ బుక్ లు మార్కెట్లోకి రానున్నాయి. హెచ్ టీసీ ఊహా జనిత ప్రపంచాన్ని కళ్లముందుకు తెచ్చే వర్చ్యువల్ రియాలిటీ హెడ్ సెట్ ను డిసెంబరులోగా విడుదల చేయనుంది.

  • Loading...

More Telugu News