: ఎమ్మెల్సీగా పయ్యావుల కేశవ్ ప్రమాణం... ఏపీ ‘మండలి’లో పెరిగిన టీడీపీ బలం
టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఏపీ శాసన మండలి సభ్యుడి(ఎమ్మెల్సీ)గా ప్రమాణం చేశారు. శాసన మండలి చైర్మన్ చక్రపాణి కొద్దిసేపటి క్రితం పయ్యావుల చేత ప్రమాణం చేయించారు. దీంతో ఏపీ శాసన మండలిలో టీడీపీ బలం మరింత పెరిగింది. అంతేకాక పయ్యావుల కేశవ్ రూపంలో ఆ పార్టీ స్వరం మండలిలో ప్రతిధ్వనించనుంది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఉరవకొండ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పయ్యావుల, వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. మొన్నటి ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ బరిలో అనంతపురం స్థానానికి నామినేషన్ వేసిన పయ్యావుల ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.