: ఓరుగల్లు ఉప ఎన్నికలో మీరా కుమార్?... టీ కాంగ్ సన్నాహాలు


తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఈ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను పోటీ చేయించే అవకాశాలున్నాయట. మీరా కుమార్ ను పోటీ చేయించే దిశగా టీ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటికే లోక్ సభకు ఐదుసార్లు ఎన్నికైన మీరా కుమార్ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనంతో ససారం నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. కేంద్ర మాజీ మంత్రిగానే కాక దేశ తొలి ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రాం కూతురుగా దళిత వర్గాల్లో మీరా కుమార్ కు మంచి పేరు ఉంది. అంతేకాక మొన్నటి ఏపీ పునర్ వ్యవస్థీరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంలో మీరా కుమార్ ది కీలక భూమికే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో ఆమె పట్ల సానుకూలత ఉంది. ఇక వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలో మాదిగ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు అంశాలు మీరా కుమార్ కు కలిసివస్తాయని టీ కాంగ్ నేతలు అభిప్రాయపడుతున్నారు. లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం మీరా కుమార్ తెలిపిన మద్దతు నేపథ్యంలో ఆమెపై పోటీకి ఇతర పార్టీలు విముఖత చూపడమే కాక ఆమె ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని టీ కాంగ్ నేతలు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వరంగల్ స్థానం నుంచి మీరా కుమార్ ఎన్నిక కావడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News