: క్రైం బ్రాంచ్ పోలీసుల పేరిట కిడ్నాపర్ల హల్ చల్...ఇద్దరు మహిళలు సహా నలుగురి కిడ్నాప్


సికింద్రాబాదు పరిధిలోని చిలకలగూడలో నిన్న సాయంత్రం జరిగిన కిడ్నాప్ ఘటన జంట నగరాల్లో కలకలం రేపుతోంది. చిలకలగూడ క్రైం బ్రాంచ్ పోలీసుల పేరిట రెండు సుమోల్లో రంగప్రవేశం చేసిన ఆరుగురు వ్యక్తులు హల్ చల్ చేశారు. సన్ రైజ్ ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకురాలు అంజలిరావు, ఆమె వ్యాపార భాగస్వామి నరసింహారావు, అందులో ఉద్యోగులుగా పనిచేస్తున్న శ్రావణ్, లక్ష్మిలను ఆ వ్యక్తులు అపహరించారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఘటన ప్రస్తుతం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో విచారణ కోసం స్టేషన్ కు రావాలన్న సదరు వ్యక్తులను అనుమానించిన అంజలిరావు వారి ఐడీ కార్డులను అడిగారు. అయితే ఐడీ కార్డులను వారు చూపలేదు. దీంతో ఆ వ్యక్తులు, అంజలిరావు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారిని నరసింహారావు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంజలిరావు, నరసింహారావు, అక్కడే ఉన్న శ్రావణ్, లక్ష్మిలను ఆ వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత గంటన్నరకు అంజలి తన సెల్ నుంచి తన తండ్రికి ఫోన్ చేసి తనను కిడ్నాపర్లు వరంగల్ వైపు తీసుకెళుతున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ వ్యవహారంలో నరసింహారావుపైనే అనుమానం ఉందని అంజలి తండ్రి చెబుతున్నారు. ఇదిలా ఉంటే, లోన్లు ఇప్పిస్తానని గతంలో అంజలి పెద్ద ఎత్తున వసూళ్లు చేసి పలువురిని మోసం చేసిందని, నాటి ఘటనలో బాధితులుగా ఉన్న వ్యక్తులే అంజలిని కిడ్నాప్ చేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News