: మేమేం చేయాలో పవన్ కల్యాణ్ చెప్పక్కర్లేదు: టీడీపీ ఎంపీ కొనకళ్ల


తామేం చేయాలో పవన్ కల్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రానికి కావాల్సిన పనులు చక్కబెడుతున్నామని ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి 8,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని అన్నారు. రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించే తీరువేరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు వ్యవహార శైలి వేరని అన్నారు. ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించాల్సిన తీరు ఇది కాదని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ద్వారా కాకుండా, నేరుగా వచ్చి తమను సంప్రదించాలని ఆయన సూచించారు. మిత్ర పక్షంతో వ్యవహరించే విధానం ఇది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమస్యలపై నిత్యం పోరాడుతున్నామని కొనకళ్ల అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విభజన కారణంగా ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. తిడితే కేసీఆర్ లా తిట్టాలి, పడితే సీమాంధ్ర ఎంపీల్లా పడాలని పవన్ కల్యాణ్ అంటున్నారని, తమకు సభ్యత, సంస్కారం వున్నాయి కనుక, తాము కేసీఆర్ లా తిట్టడం లేదని అన్నారు. అదీకాక తాము కూడా అలాగే మాట్లాడితే, హైదరాబాదులో ఉన్న ఆంధ్రులు బాధపడతారని ఆయన పేర్కొన్నారు. అందుకే అలా మాట్లాడడం లేదని ఆయన స్పష్టం చేశారు. బూతులు తిట్టుకోవడంలో పోటీపడకూడదని ఆయన హితవు పలికారు. మిత్రపక్షం కనుక తమ పోరాటం తీరు మారింది తప్ప, పోరాటంలో మార్పు రాలేదని ఆయన చెప్పారు. కేశినేని నానిని విమర్శించడాన్ని ఆయన ఖండించారు.

  • Loading...

More Telugu News