: ఒడిదుడుకుల మార్కెట్లో ఆరు అత్యుత్తమ పెట్టుబడి అవకాశాలు!


ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. గ్రీస్ లో నెలకొన్న పరిస్థితికి తోడు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి అసంతృప్తిగా ఉండడం, ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరల పతనం, రుతుపవనాలపై మెట్ అధికారుల అంచనాలు తృప్తికరంగా లేకపోవడం తదితరాల కారణంగా లాభాల్లోకి వెళ్తాయో, నష్టంలోకి దిగజారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటువంటి స్థితిలో కూడా మంచి రాబడులు ఇచ్చే పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అవి ఏమంటే... 1. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (బ్లూచిప్ కంపెనీలవి): మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ దిగ్గజ కంపెనీలు పెద్దగా నష్టపోలేదు. ఇదే ఫండ్ కంపెనీలను ఆకర్షిస్తున్న అంశం. కేంద్రం సైతం మాన్యుఫాక్చరింగ్ రంగానికి పెద్ద పీట వేస్తూ, సత్వర అనుమతులు ఇస్తుండటం బ్లూచిప్ కంపెనీలకు వరం. అందువల్ల ఈ తరహా కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. 2. బ్యాలెన్స్డ్ ఫండ్: పూర్తి ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి రిస్క్ బారిన పడటం ఇష్టంలేని వారికి బ్యాలెన్స్డ్ ఫండ్స్ నప్పుతాయి. వీటిల్లో ఈక్విటీలపైనే కాక డెట్ ఫండ్స్ వైపు కూడా పెట్టుబడి వెళుతుంది. డెట్ ఫండ్స్ మార్కెట్ ఒడిదుడుకులకు తలొగ్గక సమయానుసార రాబడులను అందిస్తుంది. 3. ఈపీఎఫ్ మరియు పీపీఎఫ్: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) మరియు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పెట్టుబడులు దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధితో సాగి మంచి రాబడులు అందిస్తాయనడంలో సందేహం లేదు. ఈ పెట్టుబడులపై ఆదాయపు పన్ను సెక్షన్ 80-సి ప్రకారం రాయితీలు కూడా వర్తిస్తాయి. ఈపీఎఫ్ ను విధులు నిర్వహిస్తున్న సంస్థ యాజమాన్యమే అందిస్తుంది. పీపీఎఫ్ ఖాతాను స్వయంగా నిర్వహించుకుంటూ, సాలీనా రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులుగా పెట్టుకోవచ్చు. 4. ప్రభుత్వం ఆఫర్ చేసే బాండ్లు, కార్పొరేట్ బాండ్లు: వడ్డీ కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ బాండ్లలో ఎంత మాత్రమూ రిస్క్ ఉండదు. కాబట్టి ఏ మాత్రం సంకోచం లేకుండా ప్రభుత్వం ఆఫర్ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొద్దిగా దాగుంటుంది. ఈ కంపెనీలు దివాలా తీస్తే మన పెట్టుబడి ప్రమాదంలో పడుతుంది. ఇండియాలో పెద్ద కంపెనీలైన టాటా, మహీంద్రా, రిలయన్స్, ఎల్అండ్ టీ తదితర కంపెనీలు రిస్క్ లేనివిగా భావించవచ్చు. 5. రియల్ ఎస్టేట్: కాస్త డబ్బు ఎక్కువగా ఉండి, అప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో స్థలం కొని ఉంచితే, అది అనతికాలంలోనే ఎన్నో రెట్లు పెరుగుతుంది. గత కొన్నేళ్లలో మిగతా అన్ని విభాగాల కన్నా నిర్మాణ రంగంలో పెట్టుబడే అధిక రాబడులు ఇచ్చింది. 6. విదేశీ మ్యూచువల్ ఫండ్స్: వీటి గురించి దేశవాళీ ఇన్వెస్టర్లకు పెద్దగా అవగాహన లేదు. అయితే, విదేశీ ఫండ్స్ గురించి పరిచయం చేసేందుకు డీఎస్ పీ బ్లాక్ రాక్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తదితర ఫండ్ కంపెనీలు మీ తరపున విదేశాల్లో పెట్టుబడులు పెట్టే సేవలను అందిస్తున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడులు పెట్టేముందు సదరు ఫండ్ సంస్థ లేదా బాండ్ల గురించి మరోసారి పూర్తి సమాచారం తెలుసుకుని ముందడుగు వేయాలి. అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ కు సరైన రాబడి పొందవచ్చు.

  • Loading...

More Telugu News