: 123 మందికి నరకం చూపిన పైలట్!
అది జెట్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 737 విమానం. ఈ ఉదయం ఢిల్లీ నుంచి లెహ్ కు 114 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బందితో కలసి బయలుదేరింది. మరికాసేపట్లో లెహ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సిన విమానంలో ఒక్కసారిగా ప్రయాణికుల హాహాకారాలు మిన్నంటాయి. క్యాబిన్ లగేజ్ ట్రే నుంచి ఆక్సిజన్ మాస్క్ లు ఊడి పడ్డాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. విమానంలో ఆక్సిజన్ మాస్క్ లు వాడాల్సి వచ్చిందంటే, అది అత్యంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందనే. క్రాష్ ల్యాండింగ్, వాటర్ ల్యాండింగ్, విమానానికి అద్దాలు పగలడం వంటి సమయాల్లోనే ఆక్సిజన్ మాస్క్ లు వాడాల్సి వుంటుంది. అటువంటిది ఒక్కసారిగా మాస్క్ లు రావడంతో విషయం తెలియక తీవ్ర ఆందోళన చెందారు. కాసేపు ప్రయాణికులు నరకం చూశారంటే అతిశయోక్తి కాదు. అసలు ఏమైందంటే, పైలట్ పొరపాటున మాస్క్ లను ఓపెన్ చేసే బటన్ నొక్కాడట. ఆపై కాసేపటికి లెహ్ ఎయిర్ పోర్టులో విమానం క్షేమంగా దిగింది. ఈ మొత్తం విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.