: 25 ఏళ్ల వయసుకే 57 హత్యలు!... యూపీలో పట్టుబడ్డ సీరియల్ కిల్లర్
ఉత్తరప్రదేశ్ లో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న వరుస హత్యలతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దోపిడీకి పాల్పడడం, ఇళ్లలోని వ్యక్తులను కడతేర్చడం, ఆపై పరారవడం... ఈ రీతిలో సాగాయి దుండగుల కిరాతకాలు! అయితే, తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఆ దొంగల ముఠా నాయకుడిని, ఇద్దరు అనుచరులను బరేలీలో అరెస్టు చేయడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆ ముఠాకి 25 ఏళ్ల సల్మాన్ ఖాన్ నాయకుడు. ఇప్పటివరకు తాను 57 దాకా హత్యలు చేసినట్టు అంగీకరించాడు. ఓ ఇంట్లో దొంగతనానికి వెళితే, ఆ ఇంట్లో వాళ్లందరినీ చంపేయడం ఇతడి నైజం. 15 ఏళ్లకే నేర ప్రవృత్తి అలవడింది. అటుపిమ్మట పెద్ద గ్యాంగు ఏర్పాటు చేసుకుని చోరీలు, హత్యలతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపాడు. అన్నట్టు... సల్మాన్ గ్యాంగులో మహిళలు కూడా ఉన్నారట. బరేలీ, బదౌన్, పిలిభిత్, కనౌజ్, షాజహాన్ పూర్, కాన్పూర్, హర్దోయి ప్రాంతాల్లో సల్మాన్ గ్యాంగు కిరాతకాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.