: సెక్షన్-8 కోసం డిమాండ్ చేసే పరిస్థితి తీసుకురాకండి: పవన్ కల్యాణ్


ఆంధ్రోళ్లు, సెటిలర్లు అన్న వ్యాఖ్యల కారణంగా ఒక రాష్ట్ర ప్రజలందర్నీ తిడుతున్నారన్న విషయం టీఆర్ఎస్ నేతలు గుర్తించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆంధ్రోళ్లు అన్న వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతల సమస్య చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల్లోకి ఈ వ్యాఖ్యలు వేరేలా వెళ్తున్నాయని ఆయన అన్నారు. సామాన్య ప్రజలు వీటిని నేతల తిట్లలా తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. ఈ మధ్యే తన స్నేహితుడికి జరిగిన ఓ సంఘటనను ఆయన ఉదహరించారు. సామాన్య ప్రజానీకం నేతల తిట్ల కారణంగా ప్రజలను కూడా ఆంధ్రోళ్లు అని తిడుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరిగితే సెక్షన్-8 అవసరం ఉంటుందని ఆయన హెచ్చరించారు. తాను సెక్షన్-8కి పూర్తి వ్యతిరేకమన్న ఆయన, ప్రజల్లో విద్వేషాలు రేగితే, ప్రజల్లో ఆందోళనలు రేగితే సెక్షన్-8 విధించక తప్పదని అన్నారు. సెక్షన్-8 వద్దని చెబుతున్న వారంతా ఒక్కటి ఆలోచించాలని ఆయన సూచించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది, రాజధాని లేని ఆంధ్రులు ఎక్కడికి వెళ్తారు? హైదరాబాదు రాజధాని కాదా? అని ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు హైదరాబాదులో ఉన్న వారికి అన్యాయం జరిగితే వారు ఎవరికి చెప్పుకోవాలని ఆయన అడిగారు. అధికారులు, న్యాయవాదులు, పోలీసులు న్యాయబద్ధంగా ఆలోచించి సేవలందించాలని ఆయన సూచించారు. అందరూ సమానమే అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు, వేర్పాటు వాదాన్ని ఎందుకు రాజేస్తున్నారని ఆయన నిలదీశారు. ఇకనైనా నేతలు బాధ్యతగా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. నేతలు ఇలాగే మాట్లాడి, విద్వేషాలు రెచ్చగొడితే, సెక్షన్-8 అవసరం ఏర్పడుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News