: బాలిక పట్టుదలకు లైబ్రరీ దిగొచ్చింది!
కెనడాలో ఓ బాలిక పట్టుదల కారణంగా స్థానిక లైబ్రరీ నిబంధనలు సవరించుకోక తప్పలేదు. టిమ్మిన్స్ నగరంలోని పబ్లిక్ లైబ్రరీ రోబోటిక్స్ కోర్సును ఆఫర్ చేసింది. ఈ కోర్సుకు పాఠశాల బాలురు మాత్రమే అర్హులని పేర్కొంది. ఈ నిబంధన కారణంగా కాష్ కయేన్ అనే 9 ఏళ్ల బాలికకు కోర్సులో అడ్మిషన్ లభించలేదు. దాంతో, ఆ అమ్మాయి చేంజ్.కామ్ సైట్లో ఓ ఆన్ లైన్ పిటిషన్ ను పోస్టు చేసింది. ఆ లైబ్రరీ నిర్వాహకులు అమ్మాయిలకు కూడా కోర్సులో అవకాశం కల్పించాలన్న డిమాండ్ తో ఆమె పోస్టు చేసిన పిటిషన్ కు విశేష స్పందన లభించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే 30 వేల మందికిపైగా మద్దతిచ్చారా బాలికకు. ఇంకా ఈ రోజుల్లో కూడా లింగ వివక్ష ఏంటంటూ వేలమంది ప్రశ్నించడంతో టిమ్మిన్స్ పబ్లిక్ లైబ్రరీ దిగొచ్చింది. వెంటనే కోర్సు అర్హత నియమావళిని సవరించింది. దాంతో, రోబోటిక్స్ కోర్సులో 9 నుంచి 12 ఏళ్ల లోపు వయసున్న బాలబాలికలు ఎవరైనా చేరేందుకు మార్గం సుగమమైంది.