: అభిప్రాయం లేకకాదు, నా అభిప్రాయాలు నాకున్నాయి!: పవన్ కల్యాణ్
'అభిప్రాయం లేక కాదు...నా అభిప్రాయాలు నాకున్నాయని' జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాధినేతలు బాధ్యతగా మాట్లాడవలసిన అవసరం ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల నేతలను చూస్తుంటే తనకు ఓ సామెత గుర్తు వస్తోందని...అదేంటంటే 'కొడుకు తల్లి దగ్గరకెళ్లి ఏం చేసి బతకాలని అడిగితే, నోరుచేసుకుని బతకురా' అందట, అలా ఉంది మన నేతల తీరు' అని చెప్పారు. మన నేతలు నోరు పారేసుకుని బతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు మోదీతో అహ్మదాబాద్ లో మాట్లాడినప్పుడు తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతలో భాగమని ఆయన అన్నారని ఆయన గుర్తు చేశారు. దానిని నిజం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణానికి విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్ సాయిని ఆర్కిటెక్ట్ గా పెట్టుకోవడంతో తెలుగు జాతి ఐక్యతకు మొదటి అడుగు వేశారా అనిపించిందని ఆయన తెలిపారు. ఇందుకు కేసీఆర్ కు అభినందనలని ఆయన అన్నారు.