: వాతావరణ మార్పులు ఎంత పనిచేస్తున్నాయో చూడండి!
ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా యూనివర్శిటీ పరిశోధకులు ఎంతో ఆసక్తికరమైన సంగతి వెల్లడించారు. డ్రాగన్ బల్లులపై వాతావరణ మార్పులు ఎలా ప్రభావం చూపాయో వారి పరిశోధన ద్వారా తెలిసింది. వాతావరణ ప్రేరిత మార్పుల కారణంగా ఈ బల్లులలో లింగ మార్పిడి జరుగుతోందట. మగ బల్లులు కాస్తా ఆడ బల్లుల్లా మారిపోతున్నాయని పరిశోధక బృందం తెలిపింది. ఇది ప్రకృతి కారక జన్యు ఉత్పాతం అని పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ క్లేర్ హోలెలీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు ప్రయోగశాలలో నిరూపించారు. జన్యుపరంగా మగ బల్లులను ల్యాబ్ లో విపరీతమైన ఉష్ణోగ్రతకు గురిచేయగా, ఆశ్చర్యకరంగా అవి ఆడ బల్లుల్లా మారిపోయాయట. అలా మార్పు చెందిన వాటికి ఫలదీకరణ సామర్థ్యం కూడా ఉందని హోలెలీ తెలిపారు. సాధారణ ఆడ బల్లుల కంటే లింగ మార్పిడి జరిగిన బల్లులే ఎక్కువగా గుడ్లు పెట్టాయని వివరించారు.