: యాసిన్ భత్కల్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేయనున్నారా?
జైల్లో విచారణ ఖైదీగా ఉన్న యాసిన్ భత్కల్ ను ఎన్ కౌంటర్ చేయనున్నారా? భత్కల్ తల్లి రిహానా సిద్ధిబా మాత్రం అవుననే అంటోంది. ప్రస్తుతం చర్లపల్లి కారాగారంలో ఉన్న భత్కల్ తన తల్లికి, భార్యకు ఫోన్ చేసి... ఐఎస్ఐఎస్ సహకారంతో జైలు నుంచి తప్పించుకుంటానని, డమాస్కస్ నుంచి వచ్చే వ్యక్తులు తనని బయటకు తీసుకొస్తారని చెప్పినట్టు వార్తలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై భత్కల్ తల్లి స్పందించింది. డమాస్కస్ నుంచి వచ్చే వ్యక్తులు తనను బయటకు తీసుకొస్తారని యాసిన్ తమతో ఎన్నడూ చెప్పలేదని ఆమె స్పష్టం చేసింది. వాస్తవానికి, పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని మాత్రం తమతో చెప్పాడని తెలిపింది. ఈ నేపథ్యంలో తన కుమారుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసింది. హై సెక్యూరిటీ జైలు నుంచి ఎవరైనా తప్పించుకోవడం సాధ్యమేనా? అని ఆమె ప్రశ్నించింది.